: ఫ్లిప్ కార్ట్ ను వీడి వెళ్తున్నా... ఉద్యోగులకు గుడ్ బై లెటర్ రాసిన ముఖేష్ బన్సాల్

భారత్ లోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల విభాగం హెడ్ గా ఉన్న ముఖేష్ బన్సాల్ సంస్థకు రాజీనామా చేశారు. ఫ్లిప్ కార్ట్ పైస్థాయి మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు జరుగుతున్న వేళ ముఖేష్ రాజీనామా చేయడం గమనార్హం. తన రాజీనామా విషయాన్ని ముఖేష్, సంస్థలోని అందరు ఉద్యోగులకూ మెయిల్ రూపంలో తెలియజేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలుత 'మైంత్ర'లో, ఆపై ఫ్లిప్ కార్ట్ లో తన ప్రయాణం ఎంతో సాఫీగా సాగిందని, ఇక్కడి ఉద్యోగులు అంకితభావంతో విధులను నిర్వర్తించారని చెప్పారు. అయితే,తాను ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశానన్న విషయాన్ని, తరువాత ఏం చేయాలనుకుంటున్న విషయాలను మాత్రం ముఖేష్ ఈ లేఖలో వెల్లడించలేదు. కాగా, ఫ్లిప్ కార్ట్ కొత్త చీఫ్ గా బిన్నీ బన్సాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సచిన్ బన్సాల్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. మరో రెండు నెలల పాటు ముఖేష్ సంస్థతోనే కొనసాగుతారని, తదుపరి తన స్థానంలో వచ్చే వ్యక్తికి అన్ని బాధ్యతలూ దగ్గరుండి అప్పగించిన తరువాతనే వెళ్తారని తెలుస్తోంది.

More Telugu News