: ప్రేమికుల వారం... ప్రపోజ్ చేసేందుకు కొన్ని టిప్స్!

ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే. ప్రేమికుల దినోత్సవం. మనసుకు నచ్చిన యవతి లేదా యువకుడికి ప్రేమను తెలియజెప్పే రోజు. ఇప్పటికే 'ప్రేమికుల వారం' పేరిట 7వ తేదీ నుంచి 14 వరకూ వారం రోజుల వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, ఐటీ కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో రాత్రుళ్లు పలు హోటల్స్ విద్యుద్దీప కాంతులతో ధగధగలాడుతున్నాయి. ఇంతకాలం కొనసాగిన స్నేహబంధాన్ని మరో మెట్టెక్కించి ప్రేమగా మార్చుకోవాలని తహతహలాడుతుండే యువతీ యువకులెందరో. ఎదుటివారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని... ఎర్ర గులాబీలు: రెడ్ రోజస్... ప్రేమను వ్యక్తపరిచేందుకు అత్యుత్తమ మార్గం. పూర్తి ఎర్ర గులాబీలతో ఉన్న బొకేను కానుకగా ఇచ్చి మ్యాజికల్ వర్డ్స్ 'ఐ లవ్ యూ' చెబితే, దాదాపు కాదనే పరిస్థితి ఉండదు. ఒకవేళ అప్పటికప్పుడు అంగీకారం తెలుపకపోయినా, తరువాత ఆలోచించే పరిస్థితి తప్పక ఉంటుంది. ఇది బంధం మొదలయ్యేందుకు తొలి అడుగే. డేట్ అవుట్: ఓ మంచి హోటల్ లో డిన్నర్ కోసం ముందుగానే టేబుల్ బుక్ చేసుకుని, భాగస్వామి ఇష్టానికి అనుగుణంగా డ్రస్ చేసుకుని వెళ్లి, అతడు లేదా ఆమెతో విందారగిస్తూ ప్రపోజ్ చేయడం కూడా మంచి మార్గమే. జీవితాంతం ఇదే విధమైన ఆనందాన్ని అందిస్తానని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. లేఖ రాయడం: ఇది కాస్త పాత ఫ్యాషన్ అయినప్పటికీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్. చెప్పే మాట కన్నా చేత్తో రాసే మాట హృదయాన్ని మరింతగా ఆవిష్కరిస్తుంది. ఎదుటి వారిపై మదిలో ఎంత ప్రేమ ఉన్నదన్న విషయాన్ని స్పష్టంగా, సూటిగా రాయగలిగితే, అది వారి హృదయంలో గుచ్చుకుపోయి ప్రేమను పుట్టిస్తుంది. లేఖ చేతికిచ్చిన తరువాత కూడా, అప్పటికప్పుడు ప్రేమ వ్యక్తం కాకపోయినా, మనసు మాత్రం మరోసారి ఆలోచిస్తుంది. బాలీవుడ్ స్టయిల్: బాలీవుడ్ స్టయిల్ అంటే ఏంటో కాదు... ఎక్కువ హిందీ చిత్రాల్లో కనిపించే లవ్ ప్రపోజల్. ఓ మంచి సినిమాకు తీసుకువెళ్లి అతను లేదా ఆమెతో కలసి ఆ చిత్రాన్ని చూస్తూ ప్రేమను వ్యక్తపరచడం. సినిమా అయిపోయేలోగా ప్రేమను వ్యక్తపరిస్తే మంచిదని నిపుణుల సలహా. సంగీతం: తన జీవితంలో ప్రియుడు లేదా ప్రియురాలి స్థానం ఇవ్వదలచిన వారికి, ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఇష్టమైన సంగీతాన్ని బహుమతి రూపంలో ఇవ్వడం కూడా ప్రేమ ముందడుగు వేసేందుకు దోహదపడుతుంది. ఇదో వినూత్న మార్గం కూడా. ఎంచుకునే సీడీలు, వాటిల్లోని పాటలు మీ హృదయాంతరాళాన్ని వ్యక్తపరిచేవిగా ఉండాలి సుమా. ఆపై మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

More Telugu News