: వేతనాలు పెంచితే కష్టమే: రఘురాం రాజన్

ఏడవ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సులను అమలు చేస్తే, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడనుందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. పే కమిషన్ సిఫార్సులను తాము నిశితంగా పరిశీలించామని, 5 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో ఈ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వేతనాల పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయంపైనే ద్రవ్యోల్బణం అంచనాల సవరణ ఆధారపడి వుందని రాజన్ వ్యాఖ్యానించారు. పరపతి సమీక్షలో ఎటువంటి మార్పులనూ ప్రకటించని ఆయన, వేతన సంఘం 23.6 శాతం మేరకు జీతాలను పెంచాలని సిఫార్సు చేయగా, దీన్ని కేంద్రం అంగీకరించిందని గుర్తు చేశారు. దీని వల్ల ప్రతియేటా లక్ష కోట్ల రూపాయల అదనపు భారం వ్యవస్థపై పడనుందని అన్నారు. కాగా, ఈ భారాన్ని తగ్గించుకునేందుకు అదనపు వడ్డనలు 2016-17లో ప్రజలపై మోపే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాలను కుదించేందుకు ఇప్పటికే పలు మార్గాల్లో ప్రజలపై వడ్డనలు మోపుతున్న మోదీ సర్కారు, పే కమిషన్ సిఫార్సులను అమలు చేసిన పక్షంలో ఖజానాపై పడే భారాన్ని కూడా పన్నుల పెంపు రూపంలో భర్తీ చేసుకోవాలన్న యోచనలో ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ ముందుకు బడ్జెట్ వచ్చిన తరువాతనే తదుపరి వడ్డీ రేట్లను పెంచాలా? వద్దా? అన్న విషయమై రాజన్ ఓ నిర్ణయానికి రాగలుగుతారని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు.

More Telugu News