: ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లకు చెక్!... కొత్త తరహా నియామకాలకు ‘ఫ్లిప్ కార్ట్’ శ్రీకారం

ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలన్నీ ఉంటాయి. అయినా ఆయా కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లలో నోరు పెగల్చలేని ప్రతిభావంతులు ఎంతమందో ఉద్యోగాలను అందుకోలేకపోతున్నారు. అకడమిక్ ట్రాక్ లో మంచి రికార్డు ఉన్న మెరిట్ విద్యార్థులు కూడా ఇంటర్వ్యూల్లోనే వెనక్కొచ్చేస్తున్నారు. ఈ తరహా ఇబ్బందులకు చెక్ పెట్టే కొత్త తరహా ఉద్యోగ నియామకాలకు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు నిన్న ఆ సంస్థ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లు లేని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్ లైన్ విద్యా సంస్థ ‘ఉడాసిటీ’తో ఫ్లిప్ కార్ట్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఉడాసిటీలో విద్యనభ్యసించిన విద్యార్థులకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులు, ఆ విద్యా సంస్థ నివేదికల ఆధారంగా ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే ప్రతిభావంతులను తమ సంస్థలోకి తీసుకోనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ తరహా నియామకాలను భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థల విద్యార్థులకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

More Telugu News