: భారత్ లో ‘యాపిల్’ భారీ పెట్టుబడులు...‘యువ భారత’మే కారణమంటున్న టిమ్ కుక్

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘యాపిల్’... భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ నిన్న న్యూయార్క్ లో కీలక ప్రకటన చేశారు. భారత్ లోని యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే ఈ కొత్త తరహా వ్యూహానికి తెర తీస్తున్నట్లు ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. భారత జనాభాలో సగం మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చైనాలో యువ జనాభా సగటు వయసు 37 ఏళ్లు ఉండగా, భారత్ లో ఆ వయసు 27 ఏళ్లుగా ఉందని తెలిపారు. ఈ కారణంగానే భారత్ లో పెట్టుబడులకు కీలక నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్ లో రానున్న కాలంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నాం. అంతేకాక అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్ దేశంగా భారత్ అవతరించనుంది. భారత్ లో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ ఉంది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు సానుకూలంగా ఉంది. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారత్ లోనే ఉంది. అందుకే మేం ఆ దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీర్ఘకాలంలో అధిక మొత్తంలో పెట్టుబడి పెడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News