: గ్లోబల్ మార్కెట్లలో రికవరీ, భారీగా పెరిగిన బంగారం ధర

ఇటీవలి భారీ పతనాల నుంచి ప్రపంచ మార్కెట్లు రికవరీ దిశగా పయనించాయి. సూచికల కనిష్ఠ స్థాయుల వద్ద ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లకు దిగడంతో ఆసియా మార్కెట్ సూచీలు లాభాల బాటలో నడిచాయి. అదే దారిలో సెన్సెక్స్, నిఫ్టీల పయనమూ మొదలైంది. ఈ ఉదయం జపాన్ నిక్కీ 0.29 శాతం, హాంకాంగ్ సూచి హ్యాంగ్ సెంగ్ 0.31 శాతం, కొరియా సూచి కోస్పీ 0.35 శాతం, చైనా సూచిక షాంగై కాంపోజిట్ 0.50 శాతం, తైవాన్ సూచిక తైవాన్ వెయిటెండ్ 0.17 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్ల నుండి అందిన సంకేతాలతో ప్రభావితమైన సెన్సెక్స్ ఈ ఉదయం ప్రారంభంలోనే లాభాల్లోకి వెళ్లింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 181 పాయింట్లు పెరిగి 24,243 పాయింట్ల వద్ద, నిఫ్టీ సూచిక 62 పాయింట్లు పెరిగి 7,371 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో సైతం కొత్త కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టుల నుంచి వచ్చిన మద్దతుతో ఫిబ్రవరి 5న డెలివరీ అయ్యే లాట్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 502 పెరిగి రూ. 26,559కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 261 పెరిగి రూ. 34,689 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2 శాతం పెరిగి 1,099.40 డాలర్లకు చేరింది.

More Telugu News