: అంబానీ సోదరుల కంపెనీల మధ్య డీల్!

భారత మొబైల్ మార్కెట్లో మరింత వాటాను పొంది, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్ టెల్ ను దెబ్బతీసేందుకు పారిశ్రామిక దిగ్గజ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరోసారి కలవనున్నారు. వచ్చే వారంలో స్పెక్ట్రమ్ షేరింగ్ దిశగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం), ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్ జిల్) లు కీలకమైన డీల్ కుదుర్చుకోనున్నాయి. ఇందులో భాగంగా 12 సర్కిళ్లలో ఆర్ కాంకు ఉన్న 800-850 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ ను ఆర్ జిల్ వాడుకోనుంది. అందుకు ప్రతిఫలంగా అనిల్ సంస్థకు రూ. 4,500 కోట్లను ఇవ్వనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆపై దేశంలోని 22 సర్కిళ్లలో ఇరు కంపెనీలూ తరంగాలను పంచుకుని సేవలందిస్తాయని ఆర్ కాం అధికారి ఒకరు వివరించారు. ఈ లావాదేవీ కుదరాలంటే, రూ. 1,596 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీని డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం)కు ఆర్ కాం చెల్లించాల్సి వుంది. వన్ టైం స్పెక్ట్రమ్ చార్జీ కింద ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తేనే, డీల్ ను కేంద్రం ఆమోదిస్తుంది. డీల్ కుదిరితే 800-850 మెగాహెర్జ్ పై ఇండియాలో 4జీ సేవలందించే ఏకైక సంస్థలుగా ఆర్ కాం, ఆర్ జిల్ లు నిలుస్తాయి. ఈ విషయమై అధికారికంగా స్పందించేందుకు ఆర్ కాం ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇటీవల జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో ఈ డీల్ చర్చలు ముగింపు దశలో ఉన్నాయని అనిల్ అంబానీ స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News