: 13 రోజులు - 8 సెషన్లు... రూ. 5 లక్షల కోట్లు ఆవిరి!

కొత్త సంవత్సరం ప్రారంభమై 13 రోజులు గడిచింది. ఈ 13 రోజుల్లో 8 స్టాక్ మార్కెట్ సెషన్లు జరుగగా, ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 5 లక్షల కోట్ల మేరకు హారతి కర్పూరమైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు, లాభాలను స్వీకరించేందుకే మొగ్గు చూపడంతో బిఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ కోటి కోట్ల రూపాయల స్థాయి నుంచి దిగజారింది. జనవరి 1 న రూ. 1 కోటీ 93 వేల కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, ప్రస్తుతం రూ. 95.98 లక్షల కోట్ల వద్ద ఉంది. ఈ 13 రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 5 శాతం దిగజారింది. ఇక బుధవారం నాటి సెషన్ విషయానికి వస్తే, తొలుత లాభాల్లో ఉన్న సూచికలు, ఆపై నష్టాల్లోకి జారినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 172.08 పాయింట్లు పెరిగి 0.70 శాతం లాభంతో 24,854.11 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 52.10 పాయింట్లు పెరిగి 0.69 శాతం లాభంతో 7,562.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.46 శాతం, స్మాల్ క్యాప్ 1.76 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 26 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, ఐడియా, అదానీ పోర్ట్స్, ఎల్అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 95,98,662 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,970 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 644 కంపెనీలు లాభాలను, 2160 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News