: గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తున్న ఆర్థిక మాంద్యం... సాక్ష్యాలివే!

2008లో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యం నుంచి పూర్తిగా బయటపడకముందే మరో మాంద్యం 2016లో రానుందా? అంటే, అవుననే అంటున్నారు మోర్గాన్ స్టాన్లీ అనలిస్ట్ రుచిర్ శర్మ. అందుకు పది కారణాలను కూడా చూపుతున్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలనున్నాయని ఆయన హెచ్చరించారు. మారిన పరిస్థితులను వివరిస్తూ, పది అంశాలను కళ్లముందుంచారు. 1. ప్రతి ఎనిమిదేళ్లకూ ఓ మాంద్యం: ప్రపంచ చరిత్రలో ప్రతి 8 సంవత్సరాలకూ ఒక మాంద్యం వస్తుంటుంది. అది చిన్నదా? పెద్దదా? అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయించలేం. ప్రస్తుతం ఆర్థికంగా ప్రపంచం బలహీనంగా వుంది. మరింతగా బలహీనపడేలా కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధి అడుగంటింది. వ్యవస్థకు ఉత్ర్పేరకంగా పనిచేసే అంశాలు కళ్లముందు లేవు. ప్రపంచం చైనా వెనుకే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. 2. అంతా చైనా భయమే: చైనా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. ఆ దేశంలో రుణాల స్థాయి రికార్డులను దాటేసింది. ప్రపంచంలో 10 శాతం ఆర్థిక భాగస్వామ్యాన్ని కలిగిన ఆ దేశంలో ఏ మార్పు జరిగినా ప్రపంచమంతా కనిపిస్తుంది. గత ఐదేళ్లలో 40 శాతం మేరకు పెరిగిన రుణాలు చైనాను కుదేలు చేస్తున్నాయి. యువాన్ విలువ, మార్కెట్ సూచికలు ఘోరంగా పడిపోయాయి. 3. చైనా సంక్షోభం భారత్ పై!: గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ 2015లో సున్నా శాతానికి చేరింది. ఇండియా నుంచి ఎగుమతులు 2014తో పోలిస్తే 5 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో 8 శాతం జీడీపీ వృద్ధి సాధ్యం కాదు. ఇండియాలోని పాలకుల రక్షణాత్మక ధోరణి కూడా ప్రమాదకరమే. భారత పరిశ్రమలు అమ్మకాల వృద్ధిలో ఏ మాత్రం మెరుగుదల చూపలేదు. కార్పొరేట్ల గణాంకాలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. ఇదంతా చైనాలోని సంక్షోభ ప్రభావమే. 4. కమోడిటీ ఉత్పత్తుల ధరలు: సాధారణంగా దశాబ్దం పాటు పెరుగుతూ ఉంటే కమోడిటీ ఉత్పత్తుల ధరలు, ఆపై రెండు దశాబ్దాల పాటు కుదేలౌతాయి. ప్రస్తుతం ముడి చమురు 100 సంవత్సరాల సరాసరికి దగ్గరగా ఉంది. క్రూడాయిల్ ధర మరింతగా పడిపోతుందని, వచ్చే పదేళ్లలో గరిష్ఠంగా 70 నుంచి 80 డాలర్ల మధ్య కొనసాగవచ్చని అంచనా. ఇది అమెరికాకు 2016లో అతిపెద్ద రిస్క్. చమురు ధరలు మరింతగా పడిపోతే, అది మార్కెట్ కు చెడ్డ వార్తే. 5. ప్రతి ద్రవ్యోల్బణం: 5 శాతం వరకూ పెరుగుతూ ఉండే ద్రవ్యోల్బణం సంతృప్తికరమని భావిస్తున్న వేళ, అది ప్రతి ద్రవ్యోల్బణంగా మారి నెగటివ్ దిశగా పయనిస్తుంటే, అది వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం. ఇండియాకు సంబంధించినంత వరకూ ఆయిల్ ధరల కారణంగానే ద్రవ్యోల్బణం దిగొచ్చింది. 6. యూఎస్ ఫెడరల్ రిజర్వ్: భవిష్యత్తులో అమెరికా ఆర్థికంగా సూపర్ పవర్ గా కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావించడం లేదు. ఇక వడ్డీ రేట్ల నియంత్రణ ఫెడ్ రిజర్వ్ కు సవాలుగా మారింది. మరోమారు వడ్డీ రేట్లు పెరిగితే, అమెరికా వృద్ధి బాటలో కుదేలవుతున్న సంకేతాలు స్పష్టమవుతాయి. 7. రూపాయి మారకపు విలువ: అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువలు ఒత్తిడిలో ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్న వారికి కొంత లాభమే అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలకు మాత్రం విఘాతమే. 8. 'బ్రిక్' ఔట్!: తదుపరి ప్రపంచ వ్యవస్థకు 'బూస్టింగ్' అవుతాయని భావించిన బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాలా కంపెనీలు ప్రజల నుంచి వాటాలు స్వీకరించేందుకు అనాసక్తిగా ఉంటూ, ప్రైవేటు కంపెనీలుగా ఉండి పోవాలని భావిస్తున్నాయి. దీంతో స్టార్టప్ సంస్థలకు నిధుల సమీకరణ సవాలుగా మారుతోంది. 9. ఇండియాలో ప్రభుత్వ సంస్థలు: బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమంటూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయి. బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్ధక ఆస్తుల మొత్తం భవిష్యత్తుపై గుబులు పుట్టిస్తున్నాయి. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలు సైతం లాభాలను ఆర్జించడంలో విఫలమవుతున్నాయి. 10. పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి: పలు దేశాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న ఉగ్రవాదం ప్రపంచం ముందున్న పెను సవాళ్లు. ఉగ్రదాడులతో ఎన్నో దేశాలు కుదేలవుతుండగా, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. ఈ కారణాలన్నీ మరోమారు మాంద్యం వస్తుందనడానికి సంకేతాలే!

More Telugu News