: మమ్మీ ఎక్కడో ఉందని నా చిన్నారిని భావించనీయండి...మరణించే ముందు ఓ మహిళ రాసిన ఉత్తరం...నెటిజన్ల నీరాజనం!

తన ముద్దులొలికే కూతురు బ్రియానీతోను... ప్రేమగా చూసుకునే భర్త జెఫ్ తోనూ హీతర్ మెకనమీ జీవితం హాయిగా గడిచిపోయేది. అయితే, ఉన్నట్టుండి ఒకరోజు ఆమె జీవితం పెద్ద కుదుపుకు లోనైంది. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ సోకిందని వైద్యులు బాంబు పేల్చారు. చికిత్స తీసుకున్నా అది మందులకు లొంగలేదు. దీంతో ఆమె మృత్యువాత పడింది. జీవన పోరాటంలో ఓడిపోయే ముందు ఓ లేఖ రాసింది. తాను మరణించిన తరువాత ఆ లేఖను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేయాలని సూచించింది. ఆమె చివరి కోరికను జెఫ్ తీరుస్తూ ఆ లేఖను పోస్టు చేయగా, ఆ లేఖ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే... 'ముందు మీకో చెడు వార్త...నేను మరణించాను. ఇక మంచి వార్త ఏంటంటే మీరు నా లేఖను చదువుతున్నారు. నా జీవితం ఎంతో ఆనందంగా గడిచింది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇలా అన్నింటినీ ఆస్వాదించాను. జెఫ్ ను భర్తగా పొందడం వరమైతే, అద్భుతమైన స్నేహితులను పొందడం అదృష్టం. పాప బ్రియానీకి నేను స్వర్గంలో ఉన్నానని చెప్పొద్దు. ఈ ప్రపంచంలో మమ్మీ ఎక్కడో ఉందని ఆ చిన్నారిని భావించనీయండి. నేను లేనని బాధపడకండి, ప్రతి రోజూ గుర్తు చేసుకోండి... బైబై' అంటూ ఆమె ఉత్తరం ముగించింది. దీనికి సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. మరణిస్తున్నానన్న బాధలో కూడా ఆమె ఆనందంగా వ్యక్తం చేసిన భావాలను సోషల్ మీడియా కొనియాడుతోంది.

More Telugu News