: 30 లక్షల ఉద్యోగాలను సృష్టించేలా 'టఫ్' సవరణకు మోదీ సర్కారు ఆమోదం

టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ఫండ్ (టఫ్) స్కీమ్ సవరణకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా టెక్స్ టైల్ రంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్రం నిధులను అందిస్తుంది. తద్వారా, సుమారు 30 లక్షలకు పైగా ఉద్యోగ సృష్టి జరుగుతుంది. సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను సైతం ఈ రంగం ఆకర్షించగలుగుతుంది. నేడు మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో టఫ్ సవరణలకు ఆమోదంపై చర్చించి అంగీకారం తెలిపారు. టఫ్ కు బడ్జెట్ లో రూ. 17,822 కోట్లు కేటాయించాలని, అందులో రూ. 12,671 కోట్లను ఈ రంగంలోని రుణాల మాఫీకి కేటాయించాలని, మిగిలిన మొత్తాన్ని వివిధ సంస్థల్లో టెక్నాలజీ అభివృద్ధికి రుణాల రూపంలో ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో టెక్స్ టైల్ అభివృద్ధికి అమలైన పథకాల్లో లోటుపాట్లను నివారించి, మరింత మెరుగైన, పారదర్శకమైన పనితీరు తేవాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా ఆర్థిక వ్యవహారాల కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. స్కీములో భాగంగా అపెరల్, గార్మెంట్ పేరిట రెండు విభాగాలకు సంబంధించిన విడివిడి బోర్డులు ఏర్పడతాయని, మూలధన పెట్టుబడుల్లో 15 శాతం సబ్సిడీ ఉంటుందని, ఔత్సాహికులకు ఐదేళ్ల కాలపరిమితిలో రూ. 30 కోట్ల వరకూ రుణాలందిస్తామని వెల్లడించింది.

More Telugu News