: మాకూ ఓ ఆస్కార్ కావాలి!... వ్యాపార వ్యూహాన్ని బయటపెట్టిన అమెజాన్ చీఫ్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతోంది. 1995లో అమెరికాలో పుస్తకాలను ఆన్ లైన్ లో విక్రయించడమే లక్ష్యంగా ఏర్పాటైన అమెజాన్, ఆ తర్వాత ఇతర వస్తువుల విక్రయాలకు తెర తీసింది. అంతేకాక విశ్వవ్యాప్తంగానూ తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రస్తుతం భారత ఈ-కామర్స్ విభాగంలో అమెజాన్ అగ్రగామిగానూ నిలిచింది. జర్మనీకి చెందిన పత్రిక ‘డై వెల్డ్’ నిన్నటి సంచికలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘మాకూ ఓ ఆస్కార్ కావాలి’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య, అమెజాన్ వ్యాపార వ్యూహాలను చెప్పకనే చెప్పింది. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై కామెడీ షోలతో సత్తా చాటిన అమెజాన్, ‘ట్రాన్స్ పరెంట్’ పేరిట రూపొందించిన కామెడీ షోకు ఏకంగా ఐదు ఎమ్మీ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులు చేతికి చిక్కడంతో బెజోస్... సిల్వర్ స్క్రీన్ వైపూ దృష్టి సారించారు. ఏడాదికి 16 చిత్రాల చొప్పున ఫీచర్ ఫిల్మ్ లను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాక సదరు చిత్రాలను విడుదలైన అనతి కాలంలో తన సైట్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

More Telugu News