: ఒంటరి తనం కూడా మంచిదే అంటున్న పరిశోధకులు

ఒంటరితనం అనేది మనిషిని నిరాశా నిస్పృహలకి గురిచేస్తుందని, తద్వారా డిప్రెషన్ (కుంగుబాటు)కు గురయ్యే ప్రమాదం వుందని మానసిక నిపుణులు పేర్కొంటుంటారు. అయితే, ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే, ఒంటరితనం శరీర బరువును తగ్గిస్తుందని మాత్రం ఇప్పుడు పరిశోధకులు కొత్తగా చెబుతున్నారు. అమెరికాలోని వెస్ట్రన్ వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒంటరి జీవితం, శరీర బరువు అనే అంశాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధన కోసం 1979 నుంచి 20 ఏళ్ల డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. జీవిత భాగస్వామితో కాకుండా ఒంటరిగా ఉండేవారు బరువు తగ్గుతారని ఈ పరిశోధన తేల్చింది. ఇందు కోసం 3,347 మందిని పరిశీలించినట్టు వారు తెలిపారు. ఒంటరిగా ఉన్నవారితో బాటు, విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నవారు కూడా బరువు తగ్గినట్టు వారు తెలిపారు. ఒంటరితనం కారణంగా పొందే వేదనతో బాటు, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వారు బరువు తగ్గినట్టు పరిశోధకులు వెల్లడించారు. అలాగే జీవిత భాగస్వామి వేటలో ఉన్నవారు ఫిట్ గా ఉండే క్రమంలో కూడా బరువు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.

More Telugu News