: వివాహానికి రూ. 6.5 లక్షల వరకూ రుణం... విడిపోతే మాత్రమే వడ్డీతో పాటు కట్టాలట!

ఓ చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, ఔత్సాహికుల మదిలో మెదిలే ఆలోచన వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అటువంటి ఓ వినూత్న ఆలోచనతో సియాటెల్ లో మొదలైందో స్టార్టప్ కంపెనీ. ఈ సంస్థ పనేంటో తెలుసా? ఎవరైనా వివాహానికి సిద్ధపడితే, వారికి 10 వేల డాలర్లను (సుమారు రూ. 6.5 లక్షలు) అప్పుగా ఇస్తుంది. ఇక వారి కాపురం సజావుగా సాగినంత కాలం ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. ఒకవేళ విడాకులు తీసుకుంటే మాత్రం డబ్బిచ్చిన నాటి నుంచి వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే. ఎంత వడ్డీ అన్నది ముందే నిర్ణయిస్తారట. వినడానికి కాస్తంత క్రేజీగా ఉన్నప్పటికీ, ముందు ముందు అప్పుతీసుకున్న వారి నుంచి ఈ సంస్థకు భారీ లాభాలే రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్టార్టప్ పేరు 'స్వాన్ లవ్'. దీన్ని స్కాట్ అవీ అనే వ్యక్తి స్థాపించారు. తన మిత్రుడికి పెళ్లి కుదిరి, ఆపై వెడ్డింగ్ ఖర్చుల గురించి తనతో ప్రస్తావించిన వేళ ఈ ఆలోచన తట్టిందని స్కాట్ చెబుతున్నారు. తమ సంస్థలోకి పెట్టుబడులతో ఇన్వెస్టర్లు వస్తారా? రారా? అన్న ఆలోచన ఇప్పటి వరకూ లేదని అంటున్నారు. పశ్చిమ దేశాల్లో ఈ ఆలోచన లాభాలను తెచ్చి పెట్టవచ్చేమో కాలం నిర్ణయిస్తుంది గానీ, ఇండియా వంటి దేశాలకు ఈ ఆలోచన పనికిరాదేమో కదా!

More Telugu News