: పెట్టుబడుల వెల్లువ... భారతీయ రైల్వేలపై బాలీవుడ్ కన్ను!

భారతీయ రైల్వేలపై బాలీవుడ్ సెలబ్రిటీల కన్ను పడింది. రైల్వే శాఖలోకి పెట్టుబడులను సమీకరించేందుకు ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఇచ్చిన పిలుపునకు పలువురు ప్రముఖులు స్పందించారు. ఐఆర్ఎఫ్సీ జారీ చేసిన పన్ను రహిత బాండ్లను కొనుగోలు చేసిన వారిలో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ తదితరులు ఉన్నారు. ఇండియాలో వడ్డీ రేట్లు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నందునే, తమ పెట్టుబడులు భారతీయ రైల్వేల్లో సేఫ్ గా ఉండి, మరింత రాబడిని ఇస్తాయని వీరు నమ్మారని తెలుస్తోంది. కాగా, రైల్వే శాఖ రూ. 4,532 కోట్ల సేకరణ లక్ష్యంగా బాండ్లను జారీ చేసింది. అయితే, దీనికి 2.4 రెట్ల అధికంగా రూ. 10 వేల కోట్లకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. వీటిపై సాలీనా 7.5 శాతం వరకూ పన్ను రాయితీలు లభిస్తాయి. వచ్చే 20 సంవత్సరాల పాటు పన్ను రహిత రాబడిని ఈ బాండ్ల నుంచి అందుకోవచ్చని రైల్వే శాఖ ఇచ్చిన హామీ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించిందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు. కాగా, అమీర్ ఖాన్ రూ. 10 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ రూ. 45 కోట్ల విలువైన బాండ్ల కోసం బిడ్ ను దాఖలు చేశాడు. కరీనా కపూర్ రూ. 20 కోట్లకు, కరిష్మా కపూర్ రూ. 5 కోట్లకు బిడ్లను దాఖలు చేసినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు, రైల్వేల్లో పెట్టుబడులు పెట్టాలని పలు బ్యాంకులు, వ్యాపార దిగ్గజాలు కూడా తమ తమ బిడ్లను దాఖలు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బిడ్డర్ గా నిలిచి రూ. 2,600 కోట్ల విలువై బాండ్లను కావాలని కోరింది. ఇక సాఫ్ట్ వేర్ జయింట్ విప్రో రూ. 1000 కోట్లకు బిడ్ వేసింది. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, బోష్, రిలయన్స్ కాపిటల్ సంస్థలతో పాటు ఈఅండ్ వై బాస్ రాజీవ్ మేమాని, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ, నీరజ్ బజాజ్, మధుర్ బజాజ్, మిలింద్ బార్వే తదితరులు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల విలువైన బాండ్లు కావాలని దరఖాస్తులు పెట్టారు. కాగా, వీరందరికీ ప్రతి రూ. 10 వేల బిడ్ కు రూ. 4,532కు సమానమైన బాండ్లు దక్కనున్నాయి.

More Telugu News