: ఇండియాలో ఏర్పాటుకానున్న తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్... ఇక ఎక్కడైనా ఒకే ధర!

ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫిజికల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు కానుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వచ్చే సంవత్సరంలో ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్ ని ప్రారంభించనుంది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న ఇండియాలో బంగారం మార్కెట్ ను మరింత పారదర్శకం చేసేందుకు ఈ ఎక్స్ఛేంజ్ ఉపయోగపడనుంది. ఫిజికల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా నిత్యమూ అధిక వ్యాపారం జరిగే బంగారం విషయంలో స్టాండర్డ్ ప్రైసింగ్ సాధ్యమవుతుందని ఐబీజేఏ ప్రతినిధి కేతన్ షరాఫ్ వెల్లడించారు. మరో ఆరు నెలల్లో ఈ ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. దీని యాజమాన్యం, విధివిధానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. తొలి దశలో మూడు డెలివరీ సెంటర్లతో సేవలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఎక్స్ఛేంజ్ లో జ్యూయెలర్లు, రిటెయిలర్లు, రిఫైనర్లు, బ్యాంకులు, ప్రజలు ఎవరైనా బంగారం ఏ రూపంలో ఉన్నా కొనుగోళ్లు, అమ్మకాలు జరుపవచ్చు. ముఖ్యంగా ఈ తరహా ఎక్స్ఛేంజ్ ఉండాలని చిన్న వ్యాపారుల నుంచి ఎంతో కాలంగా డిమాండ్ వస్తున్నట్టు ముంబై జ్యూయెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. చైనాలో ప్రస్తుతం ఇదే తరహా విధానంలో బంగారం లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఇండియాలో వివిధ ప్రాంతాలను బట్టి 10 గ్రాముల బంగారం ధరలో రూ. 500 వరకూ వ్యత్యాసం నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫిజికల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ వచ్చి, డెలివరీ సెంటర్లు పెరిగితే, ఎక్కడైనా ఒకే ధర ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News