: సెంటిమెంట్ పెరిగిన వేళ 7,950 ఎగువకు నిఫ్టీ!

భారత మార్కెట్ పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగిన వేళ, నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 7,950 పాయింట్ల మార్క్ ను అధిగమించి ఆపై కొద్దిగా తగ్గింది. డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ తొలి రోజున సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్దే ఉన్న సూచికలు, ఆపై దూసుకెళ్లాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ కంపెనీలు, రిటైల్ మదుపుదారులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరిపారు. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 169.57 పాయింట్లు పెరిగి 0.65 శాతం లాభంతో 26,128.20 పాయింట్ల వద్దకు చేరింది. ఒక దశలో 7,955 పాయింట్ల వరకూ పెరిగిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, చివరికి 58.90 పాయింట్ల లాభంతో 0.75 శాతం పెరిగి 7,942.70 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.46 శాతం, స్మాల్ క్యాప్ 0.32 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందాల్కో, పీఎన్బీ, ఎస్బీఐ, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, రిలయన్స్, లుపిన్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,85,586 కోట్లకు పెరిగింది. మొత్తం 2,868 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,391 కంపెనీలు లాభాలను, 1,251 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News