: లైంగిక వివక్షను ఎలా రూపుమాపాలో చూపే వీడియో...సోషల్ మీడియాలో వైరల్

చాలా కాలంగా లైంగిక వివక్షపై ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సదస్సులు... ఇంకెన్నో ప్రసంగాలు...ప్చ్ ... సమాజంలో మాత్రం మార్పు రాలేదు. అంతా ఇంటి నుంచే ఈ మార్పు మొదలు కావాలని చెబుతుంటారు. కానీ ఎలా? అన్నది ఎవరికీ అర్థం కాదు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక దర్శకుడు అద్భుతమైన వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో... ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో నిల్చున్న యువకుడు ఇంటి ముందు రోడ్డు మీదుగా స్కూలుకు వెళ్తున్న ఓ బాలికపై పూలు చల్లుతాడు. అదే రోడ్డులో తన తల్లి వయసున్న మహిళ వెళ్తుంటుంది. ఆమెపై పూలు జల్లేందుకు ప్రయత్నిస్తుండగా, అతని తల్లి టవల్ ఆరబెట్టేందుకు అక్కడికి వచ్చి కుమారుడి ప్రయత్నాన్ని గమనిస్తుంది. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడితో ఓ విషయం చెబుతుంది... 'నిన్న నేను ఆఫీస్ కు వెళ్తుండగా రోడ్డు పక్కనున్న కొందరు యువకులు పాప్ కార్న్ నా పైకి విసిరారు' అంటుంది. దీంతో యువకుడి ముఖంలో మార్పులు వస్తాయి. కోపంతో ఎర్రబడుతుంది. 'అప్పుడేం జరిగింద'ని ప్రశ్నిస్తాడు. దానికి ఆ తల్లి సమాధానం చెబుతూ 'ఏముంది? నేను వెనుకకు తిరిగి చూశాను. వారు బైక్స్ పై కూర్చున్నారు. వారిలో ఓ యువకుడు దగ్గరగా వచ్చి, ఆంటీ మీ తలలో మా పాప్ కార్న్ చిక్కుకుంది, తీసుకోమంటారా? అని అడిగాడు. ఆ సమయంలో నేనేం చేయగలను చెప్పు?' అని ప్రశ్నిస్తూ లోపలికి వెళ్లిపోతుంది. దాంతో ఆ యువకుడు తాను చేసిన పనికి సిగ్గుతో తల దించుకుంటాడు...'మీకూ ఇలాంటి అనుభవం ఉంటే చెప్పండి' అంటూ ఆ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా షేర్ అవుతోంది.

More Telugu News