: రోలర్ కోస్టర్ సెషన్ లో 'బుల్స్' పైచేయి!

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాలు ఓ వైపు కొనుగోళ్లను; మరో వైపు అమ్మకాలను ప్రోత్సహించేలా ఉంటే, రోలర్ కోస్టర్ ను తలపించిన బెంచ్ మార్క్ సూచికలు చివరికి లాభాలను నమోదు చేశాయి. షార్ట్ కవరింగ్ కు దిగిన బుల్స్ సాయంతో మధ్యాహ్నం తరువాత మార్కెట్ దూసుకెళ్లింది. మంగళవారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 104.37 పాయింట్లు పెరిగి 0.41 శాతం లాభంతో 25,864.47 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 30.95 పాయింట్లు పెరిగి 0.40 శాతం లాభంతో 7,837.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.31 శాతం, స్మాల్ క్యాప్ 0.47 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభాల్లో నడిచాయి. గెయిల్, కెయిర్న్ ఇండియా, ఐటీసీ, వీఈడీఎల్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాసిమ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,10,070 కోట్లకు పెరిగింది. మొత్తం 2,849 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,396 కంపెనీలు లాభాలను, 1,285 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News