: ఒక్క షేక్ హ్యాండ్ చాలు...మీరేం కోరుతున్నారు, మీరెలాంటి వారో చెప్పేస్తుంది!

ఎక్కడైనా కొత్తవారిని పరిచయం చేసుకునేటప్పుడు షేక్ హ్యాండ్ (కరచాలనం) ఇవ్వడం సాధారణం. ఈ ఒక్క షేక్ హ్యాండ్ మీరేంటో, మీరేం కోరుకుంటున్నారో చెప్పేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సైనికుల మధ్య మీటింగ్ జరిగేటప్పుడు ప్రారంభమైన షేక్ హ్యాండ్ సంస్కృతి అలా అలా విస్తరించి ప్రతి రంగంలోనూ శుభసూచకంగా మారిపోయింది. కొందరు షేక్ హ్యాండ్ ఇస్తే మన నుంచి ఎలాంటి బంధాన్ని ఆశిస్తున్నారో చెబుతున్నట్టు ఉంటుంది. మరి కొందరు షేక్ హ్యాండ్ ఇస్తే నిర్జీవంగా ఉంటుంది. ఏదో ముట్టుకోవడానికి చేతినిచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి తేడాలతోనే మనస్తత్వశాస్త నిపుణులు షేక్ హ్యాండ్ ను విశ్లేషించారు. రాజకీయ నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎడమ చేతితో ఆ షేక్ హ్యాండ్ ను మూస్తారు. దీని అర్థం త్వరగా అవతలి వారి నుంచి బంధం కోరుకుంటున్నారని తెలియజేయడం. మరి కొందరు ఎదుటి వారి భుజం కదిలిపోయేలా షేక్ హ్యాండ్ ఇస్తారు. దీని అర్థం అవతలి వారిని తమవైపు తిప్పుకోవాలనే భావం ఉట్టి పడుతుంది. ఇలాంటి వారు రెజ్లర్స్ అని వారు చెబుతున్నారు. ఇంకొందరు చేతిని అలా తాకించి వెనక్కి తీసుకుంటారు. రాజకీయ నాయకులు, సినీ నటులు తమ అభిమానులను కలిసినప్పుడు ఇలాంటి షేక్ హ్యాండ్ కనబడుతుంది. దీని అర్థం అవతలి వారితో ఎలాంటి బంధాన్ని కోరుకోవడం లేదని! ఇంకొందరు షేక్ హ్యాండ్ ఇస్తే అవతలి వారి చేతి వేళ్లను బలంగా నలిపేస్తారు. చేయి విరిచేసేలా ఉంటుంది వీరి వ్యవహారం. వీరు ఎదుటి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎదుటి వారిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తారు. దేశాధినేతలు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తరువాత వదలకుండా కాసేపు ఊపుకుంటారు. ఇలాంటి షేక్ హ్యాండ్ బంధం మరింత పటిష్ఠం కావాలని కోరుకుంటున్న అర్థమన్నమాట. ఇకపోతే నిజమైన షేక్ హ్యాండ్ ఎలా ఉంటుందంటే ఎదుటి మనిషి కళ్లలోకి సూటిగా చూస్తూ అవతలి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేతిని సమాంతరంగా పెట్టి సుతిమెత్తగా కనీసం ఓ మూడు సెకన్లపాటు స్పర్శించేలా ఉండేదే. ఇది అవతలి వారి నుంచి మంచి స్నేహాన్ని కోరుకుంటున్నామన్న అర్థాన్నిచ్చేది.

More Telugu News