: 2.19 లక్షల మంది ఉద్యోగులకు 'కాగ్నిజంట్' దీపావళి కానుక!

న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఈ పండగ సీజనులో తమ సంస్థలో పనిచేస్తున్న 2.19 లక్షల మంది ఉద్యోగులకు ఇవ్వదలచిన బోనస్ ను మరింతగా పెంచామని ప్రకటించింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించిన సంస్థ అమ్మకపు లక్ష్యాలను కూడా పెంచుకుని ముందుకు సాగుతోంది. కాగ్నిజంట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది భారతీయులే. "సంస్థ ఆదాయం పెరిగిన నేపథ్యంలో మన కంపెనీలోని ఉద్యోగులందరికీ నేనో సందేశం ఇవ్వదలచుకున్నాను. ఉద్యోగులంతా నిర్వహణా పనితీరును మెరుగుపరచుకున్నారు. దీనికి ప్రతిఫలంగా గత సంవత్సరం కన్నా మెరుగైన బోనస్ తో పాటు రివార్డులను ఇవ్వదలిచాము" అని కాగ్నిజంట్ అధ్యక్షుడు గోర్డాన్ జేమ్స్ కోబుర్న్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్, మూడవ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 3.19 బిలియన్ డాలర్లకు చేరగా, నిర్వహణా మార్జిన్ ఇతర పోటీ ఐటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రీతిలో 19.4 శాతానికి చేరింది. మరోవైపు సంస్థలో ఉద్యోగాలను వీడుతున్న వారి శాతం 20కి పెరగడంతోనే గోర్డాన్ అధిక బోనస్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News