: మూలన పడివున్న బంగారానికి వడ్డీ ఇస్తామంటున్న ప్రభుత్వం ... రేపు మోదీ ప్రారంభించనున్న మూడు సరికొత్త స్కీములివే!

ఇంట్లో వాడకుండా పడున్న బంగారంపై ఎవరైనా వడ్డీ ఇస్తామని చెబితే..? ప్రధాని నరేంద్ర మోదీ మదిలోని ఆలోచన ఇదే. మన ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని దేశాభివృద్ధికి వినియోగించాలన్న లక్ష్యంతో ఆయన రేపు మూడు సరికొత్త స్కీములను ప్రజల ముందుకు తేనున్నారు. వాటిల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్ - బంగారం నగదీకరణ పథకం) ప్రధానమైనది. దీంతో పాటు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్, గోల్డ్ కాయిన్ అండ్ బులియన్ స్కీములను గురువారం నాడు ఆయన ప్రారంభించనున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎంఎస్ స్కీములో భాగంగా దేశ ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని పెట్టుబడుల రూపంలో బ్యాంకులు స్వీకరించి, వాటిపై వడ్డీని ఇస్తాయి. తిరిగి పెట్టుబడిని వెనక్కు తీసుకోవాలని అనుకున్న సమయంలో అంతే బంగారాన్ని లేదా నగదును తీసుకోవచ్చు. ఇక గోల్డ్ బాండ్ల విక్రయాలు నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై ఎనిమిదేళ్ల కాలపరిమితి అమలు కానుండగా, 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల తరువాత ఎప్పుడైనా వీటిని తిరిగి ఇచ్చేయొచ్చు. ఇక గోల్డ్ కాయిన్ స్కీములో భాగంగా 5, 10 గ్రాముల బరువైన నాణాలు, 20 గ్రాముల బార్లను ఎంఎంటీసీ ఔట్ లెట్ల ద్వారా ప్రభుత్వం విక్రయించాలని భావిస్తోంది. ఈ మూడు స్కీములూ రేపు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

More Telugu News