: హర్షద్ మెహతా స్కాంలో ఇద్దరికి నాలుగేళ్ల జైలు, రూ. 5 కోట్ల జరిమానా

సుమారు ఇరవై ఏళ్ల క్రితం, భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్‌ మెహతా కుంభకోణంలో ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులను దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు వారికి శిక్షలను విధించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర మాజీ ఉద్యోగి ఎం.ఎస్‌.శ్రీనివాసన్‌, ఎస్‌.బి.ఐ మాజీ ఉద్యోగి ఆర్‌.సీతారామన్‌ లను దోషులుగా పేర్కొంటూ వీరికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షను, ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల జరిమానాను విధించింది. వీరు దేశానికి నష్టం కలిగించే చర్యలు చేశారని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. వీరు చట్టాలను ఉల్లంఘించి, బ్యాంకుల్లోని ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచారని న్యాయమూర్తి జస్టిస్ రోషన్ దాల్వి వ్యాఖ్యానించారు. కాగా, కేసులో భాగంగా 22 మందిపై విచారణ జరుగగా, వారిలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు. మిగిలిన 8 మందిలో మెహతా సహా స్టాక్ బ్రోకర్లున్నారు. కొన్నేళ్ల క్రితం హర్షద్ మెహతా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో మరో ఇద్దరు కూడా మరణించారు. కేసులో మిగిలిన నిందితులను సరైన సాక్ష్యాలు లేని కారణంగా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

More Telugu News