: ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర!

భారత ఆర్థిక రంగంలో అతి ముఖ్యమైన సంస్కరణలు అమలు చేసే దిశగా మోదీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. సవరించిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ (ఐఎఫ్‌సీ) ముసాయిదాను విడుదల చేసింది. పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లను నిర్ణయించే అధికారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్‌బీఐ) చేతుల్లో ఉండగా, దీన్ని ఏడుగురు సభ్యుల కమిటీకి అప్పగిస్తూ, ఆర్బీఐ అధికారాలకు కత్తెర వేయాలన్నది ఈ ముసాయిదాలో ముఖ్యాంశం. ఈ కమిటీలో ఆర్బీఐ గవర్నరుతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ముగ్గురు సభ్యులు, ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని 'వీటో' చేసే హక్కు ఆర్బీఐ గవర్నర్ కు ఉండదు. మెజారిటీ సభ్యుల నిర్ణయమే అమలవుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్యోల్బణం లక్ష్యాల మేరకు పరపతి సమీక్షా కమిటీ వడ్డీ రేట్లను మారుస్తూ వెళుతుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ నియమించే సాంకేతిక సలహా కమిటీ ఇచ్చే సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తాజాగా వెలువరించిన ముసాయిదాపై వివాదం చెలరేగుతోంది. కొత్త నిబంధనల విషయంలో ఆర్బీఐ, కేంద్రం ఒకే మాటపై ఉన్నాయని ఆర్థికమంత్రి జైట్లీ చెబుతున్నప్పటికీ, ఈ నిర్ణయాలు అమలైతే, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News