హార్దిక్ ను చల్లబరిచేందుకే అక్షర్ ను ఆడించారా?... ట్విట్టర్ లో జోరందుకున్న చర్చ

17-10-2015 Sat 10:03

ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీమిండియా అప్పటికే టీ20 టైటిల్ ను చేజార్చుకుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ సఫారీల చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ ల్లో సీమర్లు అంతగా రాణించలేదు. స్పిన్నర్లే కాస్త నయమనిపించారు. ఈ క్రమంలో వన్డేల్లోనూ తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన ధోనీ సేన మొన్న ఇండోర్ లో రెండో వన్డేకు జట్టులో అనూహ్య మార్పులు చేసింది. మెరుగ్గా రాణిస్తున్న స్పిన్నర్ అమిత్ మిశ్రాను పక్కనబెట్టి అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని అక్షర్ పటేల్ వమ్ము చేయలేదనుకోండి. కెప్టెన్ బ్యాటుతో చెలరేగితే, అక్షర్ పటేల్ బంతితో మేజిక్ చేశాడు. వెరసి ఫ్రీడమ్ సిరీస్ లో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఈ మ్యాచ్ ముగిసిన మరునాడు నిన్న జట్టు కూర్పుపై ట్విట్టర్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. రేపు రాజ్ కోట్ లో జరగనున్న మూడో వన్డేను అడ్డుకుని తీరతామని గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ ఇప్పటికే ప్రకటించాడు. శాంతించాలంటూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తికి హార్దిక్ ఏమాత్రం స్పందించలేదు. దీంతో హార్దిక్ ను చల్లబరిచేందుకు వ్యూహ రచన చేసిన బీసీసీఐ అతడి సామాజిక వర్గానికి చెందిన అక్షర్ పటేల్ ను మైదానంలోకి దింపిందని ఆసక్తికర కామెంట్లు ట్విట్టర్ లో పోస్టయ్యాయి. ‘‘ఆ పటేల్ ను శాంతింపజేసేందుకు ఈ పటేల్ ను దించారు. ఈ మంత్రం ఫలిస్తుందో, లేదో?’’ అని నెటిజన్లు సెటైర్లు విసిరారు.