చివరి గంటలో దూసుకెళ్లిన స్టాక్స్

16-10-2015 Fri 16:45

సెషన్ ఆరంభం నుంచి పడుతూ, లేస్తూ నష్టాల్లో సాగిన బెంచ్ మార్క్ సూచికలు మధ్యాహ్నం 2 గంటల తరువాత దూసుకెళ్లాయి. యూరప్ మార్కెట్లలో కనిపించిన నూతన కొనుగోళ్లు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపి, సెంటిమెంటును పెంచాయి. దీంతో, శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 204.46 పాయింట్లు పెరిగి 0.76 శాతం లాభంతో 27,214.60 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక నిఫ్టీ 58.65 పాయింట్లు పెరిగి 0.72 శాతం లాభంతో 8,238.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.38 శాతం, స్మాల్ క్యాప్ 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈ-50లో ఎస్బీఐ, ఎల్అండ్ టీ, బీపీసీఎల్, యస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభపడగా, లుపిన్ అదానీ పోర్ట్స్, ఐడియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. గురువారం నాడు రూ. 99,34,979 కోట్ల వద్ద ఉన్న బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,79,978 కోట్లకు చేరింది.