'మేకిన్ ఇండియాకు జై' అంటున్న బోయింగ్!

16-10-2015 Fri 16:30

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఇండియాపై కన్నేసింది. ప్రధాని మోదీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా'కు మద్దతిస్తూ, ఇండియాలో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును స్థాపించాలని నిర్ణయించింది. ఇక్కడ ఎఫ్-18 హార్నెట్ తరహా యుద్ధ విమానాలను తయారు చేయాలన్నది సంస్థ ఆలోచన. ఇటీవల ఇండియా యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాలని కాంట్రాక్టులు పిలిచిన సమయంలో పోటీలో నిలిచిన బోయింగ్, బిడ్డింగ్ విధానంలో మాత్రం సఫలం కాలేకపోయింది. ఆ డీల్ ను ఫ్రాన్స్ సంస్థ రఫాలే దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత 126 ఫైటర్ విమానాలను కొనాలని భావించినా, ఆపై డీల్ ను 36 విమానాలకు తగ్గిస్తూ, మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఫైటర్ జెట్ విమానాలను తయారు చేయాలన్నది తమ ఉద్దేశమని బోయింగ్ చైర్మన్ జేమ్స్ మెక్ నెర్నీ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక్కడ తయారు చేసే విమానాలను ఎగుమతి చేసే ఉద్దేశం కూడా ఉన్నట్టు వివరించారు. మరో రెండేళ్లలో ప్లాంటు స్థాపన అవకాశం తమకు లభిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 'మేకిన్ ఇండియా' కార్యక్రమం భారత్ ను ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరో బ్లూప్రింట్ ఇచ్చి, దాన్ని అమలు చేయాలనుకుంటే కేంద్రం ఆలోచన సఫలం కాదని, ఈ విషయం ప్రధానికి కూడా తెలుసునని భావిస్తున్నట్టు మెక్ నెర్నీ వ్యాఖ్యానించారు. ఇండియాలో ప్లాంటు పెడితే తొలుత అపాచీ యుద్ధ విమానం లేదా చినోక్ చాపర్ ల అసెంబ్లింగ్ యూనిట్ ను ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, 37 హెలికాప్టర్లు (22 అపాచీ, 15 చినోక్ లు) అందించేందుకు సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన డీల్ ను భారత ప్రభుత్వంతో బోయింగ్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.