‘ధూమ్ 4’లో బిగ్ బీ!... బాలీవుడ్ హిట్ సీక్వెల్ పై ఆసక్తికర చర్చ

16-10-2015 Fri 12:45

బాలీవుడ్ లో ‘ధూమ్’ పేరిట రిలీజైన చిత్రం కొత్త ఒరవడికి నాంది పలికిందనే చెప్పాలి. ఇప్పటిదాకా ఈ చిత్రం పేరిట మూడు సీక్వెల్స్ విడుదలయ్యాయి. ‘ధూమ్’పై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యశ్ రాజ్ ఫిలింస్’... ‘ధూమ్ 2’తో కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా రెండేళ్ల క్రితం బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ తో రిలీజైన ‘ధూమ్ 3’ అప్పటిదాకా ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా యశ్ రాజ్ ఫిలింస్ ‘ధూమ్ 4’ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. తొలి మూడు సీక్వెల్ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించిన చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు ఇందులోనూ అవే పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘ధూమ్ 2’లో దుమ్మురేపిన హృతిక్ రోషన్ కూడా తాజా సీక్వెల్ లో కనిపిస్తాడట. ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ‘ధూమ్ 4’లో బిగ్ బీ పేరు వినిపించగానే బాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. చిత్రంలో బిగ్ బీ ఏ తరహా రోల్ పోషిస్తున్నారన్న విషయంపై బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.