డెలివరీ బాయ్ ల అవతారం ఎత్తనున్న ‘ఫ్లిప్ కార్ట్’ ఓనర్లు!

16-10-2015 Fri 12:23

ఈ-కామర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ‘బన్సల్’ మిత్ర ద్వయం అనతి కాలంలోనే బిలియనీర్లుగా ఎదిగారు. ఏడేళ్లలోనే దేశంలో ఈ-కామర్స్ రంగంలో దిగ్గజాలుగా ఎదిగిన వీరిద్దరూ తాజాగా తమ సంస్థ ద్వారా కొనుగోళ్లు జరిపిన వినియోగదారుల ఇళ్ల ముందు డెలివరీ బాయ్ లుగా ప్రత్యక్షం కానున్నారు. అయినా, దేశవ్యాప్తంగా ప్రతి నగరంలోనూ డెలివరీ బాయ్ లను నియమించుకున్న వీరికి డెలివరీ బాయ్ లుగా పనిచేయాల్సిన అవసరం ఏమిటనేగా మీ అనుమానం. అదేదో తమ సంస్థ అమ్మిన ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ లు వెళ్లడం లేదులెండి. తమ సంస్థపై వినియోగదారుల మనసులోని అసలు మాటను తెలుసుకునేందుకే వీరు డెలివరీ బాయ్ అవతారం ఎత్తనున్నారట. రానున్న 15 నుంచి 20 రోజుల్లో సంస్థలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు కూడా ‘బన్సల్’ ద్వయం లాగానే డెలివరీ బాయ్ లుగా కస్టమర్ల వద్దకెళ్లి వారి మనోగతాన్ని సేకరించే యత్నం చేస్తారట.