జ్యుడీషియల్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

16-10-2015 Fri 10:52

న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ సర్కారుకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి అప్పటిదాకా ఉన్న కొలీజియం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కొత్తగా ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్’ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలుత లోక్ సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం లభించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ అమల్లోకి వచ్చింది. అయితే జ్యుడీషియల్ కమిషన్ పై ఆది నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో పాటు న్యాయ కోవిదులు కూడా ఆసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్ లుగా పనిచేసిన ఇద్దరు న్యాయమూర్తులు బహిరంగంగానే ఈ వ్యవస్థను తప్పుబట్టారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ రాజ్యంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. పాత పద్దతి (కొలీజియం వ్యవస్థ) ద్వారానే న్యాయమూర్తుల నియామకాలను చేపట్టాలని తీర్పు చెప్పింది.