: 'కాల్ డ్రాప్' అయిన ప్రతిసారీ పరిహారం!

సెల్ ఫోన్లలో మాట్లాడుతున్న సమయంలో 'కాల్స్' కట్ అవుతున్నాయా? ఇకపై మీ కాల్ డ్రాప్ అయిన ప్రతిసారీ పరిహారం లభిస్తుంది. ఈ దిశగా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సిఫార్సులకు అతి త్వరలో కేంద్రం ఆమోదం పలకనుందని తెలుస్తోంది. కాల్ డ్రాప్ అయిన ప్రతిసారీ రూ. 1 పరిహారంగా టెల్కో సంస్థలు చెల్లించాలని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నేడు తన సిఫార్సు లను అందించనుంది. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తాము ఎన్నిమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కాల్ డ్రాప్ విషయంలో మార్పు రాలేదని ఈ సందర్భంగా ట్రాయ్ అభిప్రాయపడింది. కనీస నిబంధనలు ఏ టెల్కో కూడా చేరుకోలేదని, మంచి క్వాలిటీ సేవలను కస్టమర్లకు అందించడంలో ప్రముఖ సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ విఫలమవుతున్నాయని తెలిపింది. కనీసం కాల్ డ్రాప్స్ కు సరైన కారణాన్ని కూడా ఈ కంపెనీలు అన్వేషించలేదని విమర్శించింది. తమ నెట్ వర్క్ సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతోందని, తప్పంతా టెల్కోలదేనని పేర్కొంది. కాగా, టెల్కోలు మాత్రం, కాల్ డ్రాప్ విషయం తమ నియంత్రణలో ఉండటం లేదని అంటున్నాయి. కాల్ డ్రాప్ లను పర్యవేక్షించే మెకానిజమ్ ఏర్పాటు చేయాలంటే ఎంతో వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నాయి.

More Telugu News