‘మై బ్రిక్స్ - మై అమరావతి’కి అనూహ్య స్పందన...తొలి రోజే 2.33 లక్షల ఇటుకల దానం

16-10-2015 Fri 07:44

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న రీతిలో ఇటుకల దానానికి తెర తీసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరిట ఇప్పటికే ప్రారంభమైన ‘amaravati.gov.in’ వెబ్ సైట్లో ‘మై బ్రిక్స్ - మై అమరావతి’ పేరిట కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ సహచరుల సమక్షంలో ప్రారంభించారు. ప్రారంభించిన రోజే దీనికి విరాళాలు పోటెత్తాయి. నిన్న రాత్రి 12.30 గంటల వరకు 2,270 మంది దాతలు ఈ వెబ్ సైట్ ద్వారా 2.33 లక్షల ఇటుకలను దానం చేశారు. ఇక నేటి ఉదయం 8 గంటల వరకు 3,102 మంది దాతలు 3,11,068 ఇటుకలను దానం చేశారు. ఒక్కో ఇటుక ఖరీదును రూ.10 గా పేర్కొన్న ప్రభుత్వం, ఇటుకల రూపంలో దానమిచ్చి తమ ఇటుకలు కూడా రాజధాని నిర్మాణంలో ఉపయోగించబడ్డాయన్న సంతృప్తిని పొందాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.