క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన గంగూలి

15-10-2015 Thu 21:23

బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలి గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా, క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా దాల్మియా కుమారుడు అభిషేక్ దాల్మియా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గంగూలి, అభిషేక్ లను పశ్చిమ బెంగాల్ యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఆరూప్ బిశ్వాస్ సత్కరించారు. జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో క్యాబ్ అధ్యక్షపదవికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ పదవిని దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతలు చిత్రక్ మిత్రా, గౌతమ్ దాస్ గుప్తా, సబ్రతా ముఖర్జీ పోటీపడిన విషయం తెలిసిందే. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలి బాధ్యతలు చేపడతాడని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాడు ప్రకటించారు. తర్వాత అలాగే జరిగింది!