బిచ్చం వెయ్యలేదని ప్రాణాలు తీసేశాడు

15-10-2015 Thu 15:37

వందరూపాయలు బిచ్చంగా వేయనందుకు దారుణానికి పాల్పడ్డాడు ఒక బిచ్చగాడు. బిచ్చం ఇవ్వని వ్యక్తిని పట్టుకుని అప్పుడే వస్తున్న రైలుకిందకి దూకేసిన ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్ లోని పాపుండ్ రైల్వేస్టేషన్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాపుండ్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ పై సర్వేశ్ కుమార్ అనే ప్రయాణికుడు నిలబడి ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఒక బిచ్చగాడు రూ.100 ఇవ్వమని సర్వేశ్ ని అడిగాడు. సర్వేశ్ నిరాకరించాడు. దీనికి ఆగ్రహించిన బిచ్చగాడు, సర్వేశ్ ని గట్టిగా పట్టుకుని అప్పుడే వస్తున్న రైలు కిందకు దూకాడు. దీంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు మాట్లాడుతూ, బిచ్చం వేయని సర్వేశ్ తో బిచ్చగాడు అసభ్యంగా మాట్లాడాడన్నారు. దీంతో విసుగు చెందిన సర్వేశ్ సాయం కోసం ఎదురుచూస్తుండగానే ఈ విషాద సంఘటన జరిగినట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, బిచ్చగాడికి మతిస్థిమితం లేదన్న విషయం తమ విచారణలో తేలిందన్నారు.