వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్

15-10-2015 Thu 13:19

వైకాపా నేత వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతుగా నిలిచారు. ఈ ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన "జగన్ నిరాహార దీక్ష డ్రామా అని ఆరోపిస్తున్న తెలుగుదేశం మంత్రులు, అదే దీక్షను ఎందుకు ఆపివేయించారు?" అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఆయన దీక్ష చేపడితే, బాబు మంత్రివర్గం అర్థంలేని వ్యాఖ్యలు చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతుంటే విమర్శించడం తగదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును వివాదాస్పదం చేస్తే టీడీపీని ప్రజలు క్షమించరని హితవు పలికారు. మిత్రపక్షంగా ఉండి బీజేపీ చేస్తున్న ఆరోపణలకు సైతం తెలుగుదేశం సమాధానం ఇవ్వలేకపోతున్నదని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా కన్నా ఈవెంట్ మేనేజర్ గా విజయం సాధిస్తున్న చంద్రబాబు, మరోసారి ఎన్నికలు వస్తే నామరూపాల్లేకుండా పోతారని ఉండవల్లి విమర్శించారు.