కానిస్టేబుల్ ఓబులేసుకు జీవిత ఖైదు... నిత్యానందరెడ్డిపై కాల్పుల ఫలితమే!

15-10-2015 Thu 12:45

హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడ్డ కానిస్టేబుల్ ఓటులేసుకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్ 19న మార్నింగ్ వాక్ కు వచ్చిన నిత్యానందరెడ్డిపై అక్కడే మాటు వేసిన ఓబులేసు కాల్పులకు దిగాడు. అయితే వెనువెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి బుల్లెట్ గాయాల నుంచి తప్పించుకోవడమే కాక ఓబులేసును పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో నిత్యానందరెడ్డి నుంచి తప్పించుకున్న ఓబులేసు పరారయ్యాడు. హైదరాబాదులో పెను కలకలం రేపిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టి కర్నూలులో దాక్కున్న ఓబులేసును అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దాదాపు ఏడాది విచారణ జరిపిన నాంపల్లి కోర్టు నిందితుడికి జీవత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.