కేన్సరుకు అడ్డుకట్ట మలేరియా... అనుకోకుండా గుర్తించిన సైంటిస్టులు

15-10-2015 Thu 12:44

ప్రపంచ ప్రజల ప్రాణాలను తీస్తున్న మహమ్మారి కేన్సర్ కు చికిత్స దిశగా శాస్త్రవేత్తలు అతిపెద్ద విజయాన్ని సాధించారు. అనుకోకుండా వారు కనుగొన్న ఓ ఆయుధం కేన్సర్ పై పోరాడేందుకు అత్యంత కీలకంగా మారనుంది. మలేరియా క్రిమిని వ్యాపింపజేసే ఓ రకమైన పాజిటివ్ ప్రొటీన్ కేన్సర్ ను ఓడిస్తున్నదని డానిష్ రీసెర్చర్ల బృందం కనిపెట్టింది. మలేరియా బారి నుంచి గర్భిణీ స్త్రీలను రక్షించడంపై పరిశోధనలు చేస్తున్న వీరు... ఆ ప్రొటీన్, కేన్సర్ పై పోరాడుతున్నదని గుర్తించారు. మలేరియా వాక్సిన్ లోనే ఈ ప్రొటీన్లున్నాయని, వీటిని మరింతగా శక్తిమంతం చేసే మార్గాలను అన్వేషించాల్సి వుందని సైంటిస్టులు చెబుతున్నారు. గర్భాశయంలోని మాయ పెరుగుదల, కేన్సర్ కణితి పెరుగుదల మధ్య ఉన్న సారూప్యతలపై శోధిస్తున్నామని, దీనిలో విజయం సాధిస్తే, కేన్సర్ నాశన ఔషధం తయారైనట్టేనని కోపెన్ హాగెన్ వర్శిటీ సైంటిస్టు అలీ సలాంటి నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో మలేరియా ప్రొటీన్ ఔషధాన్ని కేన్సర్ ఉన్న మానవులపై ప్రయోగాత్మకంగా వాడవచ్చని భావిస్తున్నట్టు వివరించారు. "ఇప్పటికే మేము కార్బోహైడ్రేట్ లతో కలిసుండే మలేరియా ప్రొటీన్ ను వేరు చేశాం. దీనికి కొంత టాక్సిన్ లను కలిపాము. చుంచులపై పరీక్షలు చేస్తే, ప్రొటీన్, టాక్సిన్ ల మిశ్రమం కేన్సర్ కణాలను చంపేసింది" అని కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీ రీసెర్చర్ మాడ్స్ డుగ్గార్డ్ వివరించారు.