మిస్టరీగా క్రికెటర్ దుర్గా భవాని ఆత్మహత్య... ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరిన సూసైడ్ నోట్

15-10-2015 Thu 12:16

విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్ దుర్గా భవాని ఆత్మహత్మ మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు ముందు దుర్గా భవాని రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ నోట్ లో న్యాయపరమైన వివాదాలు, ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన కోడ్ భాష ప్రత్యక్షమైంది. అసలు సూసైడ్ నోట్ లో ఉన్న చేతిరాతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా స్పృహలో ఉండే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సదరు నోట్ లో దుర్గా భవాని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ నోట్ లోని కోడ్ భాషలోని గుట్టును నిగ్గు తేల్చేందుకు దానిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గతంలో తనపై ఓ ప్రముఖ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని దుర్గా భవాని ఆరోపించింది. అయితే సదరు ఆరోపణలను ఆమె ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న అనతి కాలంలోనే దుర్గా భవాని ఆత్మహత్య చేసుకుంది. నాడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రముఖుడి చుట్టూ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.