: సంజయ్ దత్ కు మద్దతా? పాకిస్థాన్ క్రికెటర్ కు విందెలా ఇచ్చారు?: శివసేనపై బీజేపీ ఎదురుదాడి

మహారాష్ట్రలో అధికార బీజేపీ, శివసేన పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పాకిస్థాన్ మూలాలున్న వారిని ఇండియాలోకి రానిచ్చేది లేదని భీష్మించుకుని పలు విధాలుగా నిరసనలు తెలియజేస్తున్న శివసేనపై బీజేపీ నిప్పులు చెరుగుతూ ఎదురుదాడికి దిగింది. 1993 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ దత్ కు ఆ పార్టీ మద్దతెందుకు ప్రకటించిందని బీజేపీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ షీలర్ ప్రశ్నించారు. ఆ తరువాత పాక్ క్రికెటర్ కు బాల్ థాకరే స్వయంగా విందు ఇవ్వడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పాక్ క్రికెటర్ ను ఇంటికి పిలిచి విందు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అప్పట్లో జాతీయవాదం ఎటు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. శివసేన అవకాశవాద రాజకీయాల గురించి ప్రజలకు పూర్తిగా తెలుసునని ఆయన అన్నారు. "మా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు దేశభక్తి, జాతీయవాదాల గురించి చెప్పాలనుకుంటున్న వారు ముందుగా తమ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరడం లేదని గుర్తుంచుకోవాలి. తన చిన్న నాడే శ్రీనగర్ లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యక్తి ఫడ్నవీస్" అని ఆశిష్ వ్యాఖ్యానించారు.

More Telugu News