ధోనీ సేన... టీ20 వరల్డ్ కప్ ఫేవరెట్: విండీస్ దిగ్గజం బ్రయన్ లారా

15-10-2015 Thu 07:51

ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇటీవల కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా టీ20 జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ధర్మశాలలో జరిగిన టీ20లో చేతికి అందిన మ్యాచ్ నూ చేజార్చుకుంది. వెరసి పర్యాటక జట్టుకు అప్పనంగా టైటిల్ ను కట్టబెట్టి విమర్శల జడివానను ఎదుర్కొంది. అయితే టీమిండియా టీ20 జట్టు ప్రపంచంలోని అన్ని జట్ల కంటే కూడా మెరుగైన స్థితిలో ఉందంటూ విండీస్ మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రయన్ లారా పేర్కొన్నాడు. రానున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్ అని అతడు వ్యాఖ్యానించాడు. నిన్న ‘యప్ టీవీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చిన సందర్భంగా బ్రయన్ లారా ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘కఠిన ప్రత్యర్థితో భారత్ ఆడుతోంది. సొంత మైదానాల్లో ఆడేటప్పుడు ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. కాని పరిణతి సాధించిన టీమిండియా జట్టుకు టీ20 వరల్డ్ కప్ నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని లారా పేర్కొన్నాడు.