ఆతిథ్యంలో ఆంధ్రులను మించినవారు లేరని రుజువు చేయాలి: ఏపీ మంత్రులు

14-10-2015 Wed 14:48

రాజధాని శంకుస్థాపనకు వచ్చే అతిథులకు చేసే మర్యాదల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ అధికారులకు సూచించారు. అతిథులను సాదరంగా ఆహ్వానించడం మొదలు సగౌరవంగా సాగనంపే వరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు. జపాన్, సింగపూర్ నుంచి వచ్చే అతిథులకు స్థానిక వంటకాల రుచులను చూపించాలన్నారు. ఆతిథ్యంలో ఆంధ్రులకు ఎవరూ సాటిరారన్న వాస్తవాన్ని మరోమారు రుజువు చేయాలని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా వివిధ దేశాల మంత్రులు, రాయబారులు, కేంద్ర మంత్రులు, కార్యదర్శులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక ప్రముఖులు శంకుస్థాపనకు రానున్నారని మంత్రులు తెలిపారు.