'గోద్రా' వల్లే మిమ్మల్ని గౌరవించాం: ప్రధానిపై శివసేన నిప్పులు!

14-10-2015 Wed 13:39

గులాం అలీ కార్యక్రమం రద్దు, దాద్రి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన పార్టీ నిప్పులు చెరిగింది. గోద్రా ఘటనల వల్లే ఆయన్ను ఇంతకాలమూ గౌరవించామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. "గోద్రా, అహ్మదాబాద్ ఘటనల వల్లే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కారణంతోనే ఆయన్ను మేము గౌరవించాం. కానీ, ఈ తరహా కామెంట్లతో ఆయన మా దృష్టిలో 'డియర్ మోదీజీ' బదులుగా 'ప్రైమ్ మినిస్టర్' అయిపోయారు" అని విమర్శించారు. బెంగాలీ దినపత్రిక 'ఆనంద బజార్'కు ఇంటర్వ్యూ ఇస్తూ తొలిసారిగా ఇటీవలి ముస్లిం వ్యతిరేక ఘటనలపై ప్రధాని స్పందించిన సంగతి తెలిసిందే. "దాద్రి ఘటన లేదా పాక్ గాయకుడి పట్ల వ్యతిరేకత చూపడం దురదృష్టకరం" అని వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలో శివసేన నేత ఈ విమర్శలు చేయడం గమనార్హం.