: ఇండియా వెన్నులో వణుకు పుట్టిస్తున్న చైనా విద్యుత్ ఉత్పత్తి!

తమ అధీనంలో ఉన్న టిబెట్ లోని బ్రహ్మపుత్రా నదిపై చైనా రూ. 9,764 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన అతిపెద్ద డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, భారత్ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తోంది. ఈ డ్యామ్ తో దిగువ ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుందని, హిమాలయాల్లో వరదలు వచ్చి భారీ స్థాయిలో నీటిని విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోతాయని ఇండియా వాదిస్తుండగా, చైనా దీన్ని కొట్టి పారేస్తూ, డ్యామ్ నిర్మాణాన్ని, ఆపై 2.5 బిలియన్ కిలోవాట్-అవర్స్ జల విద్యుత్ తయారీని ప్రారంభించింది. డ్యామ్ లో విద్యుత్ తయారీ ప్రారంభమైందని చైనా అధికార 'క్సిన్హువా' న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. కేవలం టిబెట్ లో కరెంటు కష్టాలు తీర్చేందుకే దీన్ని చేపట్టామని చెబుతున్నప్పటికీ, దిగువకు నీరివ్వకుండా చూడాలన్నది చైనా ఉద్దేశమని ఇండియా ఇప్పటికే ఎన్నోమార్లు వాదించింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న డ్యామ్ లను పర్యవేక్షించాలని ఇండియా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా, ఇండియాకు 550 కిలోమీటర్ల దూరంలో, కేవలం 25 కిలోమీటర్ల పరిధిలో ఆ దేశం మూడు డ్యాములను నిర్మించిందని గుర్తించింది. గత కొన్నేళ్లుగా ఈ విషయంలో చైనాతో చర్చలు జరుపుతూ, డ్యామ్ ల నిర్మాణం కారణంగా ఇండియాకు కలిగే నష్టాన్ని వివరిస్తున్నా, చైనా వాటిని పెడచెవిన పెడుతుందన్న విమర్శలు ఉన్నాయి. వరదలు వస్తే అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని అప్పర్ సియాంగ్, లోయర్ సుహన్ శ్రీ ప్రాజెక్టులకు పెను విఘాతం కలుగుతుందని, భారీ మొత్తంలో వచ్చే నీటిని ఈ ఆనకట్టలు తట్టుకోలేవని ప్రస్తుతం భారత్ భయపడుతోంది.

More Telugu News