ఎవరికీ కనిపించని భారత 'జలాయుధం'... ఇప్పుడు యుద్ధ క్రీడల కోసం బయటకు ఎందుకొచ్చిందంటే..!

14-10-2015 Wed 10:21

భారత నావికాదళ శక్తి సామర్థ్యాల గురించి చాలా దేశాలకు ఇంత వరకూ తెలియదు. అంత రహస్యంగా నౌకాదళ కార్యకలాపాలు సాగుతుంటాయి. మన నౌకాదళ శక్తి గురించి దేశ ప్రజలకే పూర్తి అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోని నావికాదళం అమ్ములపొదిలో ఉన్న అత్యంత ప్రధాన అస్త్రాలలో రష్యాలో 'కిలో' క్లాస్ సబ్ మెరైన్ గా తయారైన 'ఐఎన్ఎస్ సింధుధ్వజ్' ఒకటి. దీని పేరు తప్ప ఇది ఎంత శక్తిమంతమో చాలా మందికి తెలియదు. ఇప్పటికే పలు దేశాలు ఈ జలాంతర్గామిని సందర్శించేందుకు అనుమతులు కోరినా భారత్ నిరాకరించింది. మహాసముద్ర జలాల్లో ఎవరికీ కనిపించకుండా వెళ్లి శత్రువులపై దాడులు జరిపి రావడం ఈ 'కిలో' క్లాస్ సబ్ మెరైన్లకున్న ప్రధాన శక్తి. ఇప్పుడీ అస్త్రం తన శక్తిని చూపేందుకు బంగాళాఖాతంలోకి వస్తోంది. ఇండియా, అమెరికా, జపాన్ దేశాలు మలబార్ సిరీస్ లో భాగంగా జరుపుతున్న యుద్ధ క్రీడల్లో ఈ జలాంతర్గామి పాల్గొనబోతోంది. వాస్తవానికి ఈ మూడు దేశాలకూ చైనా నుంచి ఎంతో కొంత ముప్పు ఉంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 12 ఇదే తరహా 'కిలో' క్లాస్ జలాంతర్గాములున్నాయి. వీటిల్లో 10 వరకూ ఇండియా దగ్గరున్న సబ్ మెరైన్ కన్నా ఆధునికమైనవని తెలుస్తోంది. ఇండియాకు అమెరికా, జపాన్ లు మిత్ర దేశాలుగా ఉండగా, ఈ కూటమికి చైనా దూరంగా ఉంటోంది. దీంతో పసిఫిక్ మహాసముద్రంతో పాటు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధం చేయాల్సి వస్తే పాటించాల్సిన వ్యూహాలపై ట్రయల్ రన్ వేసేందుకే ఈ సబ్ మెరైన్ ను బయటకు తీస్తున్నట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న ఈ యుద్ధ క్రీడల్లో యూఎస్, జపాన్ షిప్ లను తప్పుదారి పట్టించడం, కనిపించకుండా వెళ్లి చిన్న సబ్ మెరైన్లను ధ్వంసం చేయడం వంటి పనులను ఎంత సమర్థవంతంగా ఐఎన్ఎస్ సింధుధ్వజ్ పూర్తి చేస్తుందన్నది వీక్షకులకు ఆసక్తికరం కానుంది. ఓ యువ కెప్టెన్ ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ అందరికీ కనిపిస్తూ, నీటిలోకి వెళ్లి ఆపై తన శక్తిని చూపించనుంది. ఈ ఆటల్లో పాల్గొనే విమానాలు, యుద్ధ నౌకలకు ఒకటే ఆదేశం ఉంటుందని తెలుస్తోంది. ఒక శత్రువు సబ్ మెరైన్ నీటిలో ఉంది. దాన్ని కనుగొని నాశనం చేయాలి. అది విడిచే బాంబులను తప్పించుకోవాలి. ఇందుకోసం క్రీడల్లో పాల్గొనే వారికి తెలియని ప్రాంతంలో ఓ డమ్మీ సబ్ మెరైన్ ను సైతం ఉంచుతారు. ఓ సిములేటింగ్ గేమ్ లా ఇది సాగుతుందని తెలుస్తోంది.