మోదీకి ‘అమరావతి’ ఆహ్వానం నేడే...కేంద్రం మంత్రులకు పత్రికలు అందించనున్న చంద్రబాబు

14-10-2015 Wed 10:06

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఇప్పటిదాకా మోదీకి ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వాన పత్రిక అందలేదు. మొన్నటి కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబునాయుడు ఆహ్వాన పత్రికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీకి ఆహ్వాన పత్రికను స్వయంగా అందించనున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు తొలుత నీతి ఆయోగ్ లో స్వచ్చ భారత్ సబ్ కమిటీ భేటీలో పాలుపంచుకుంటారు. ఆ తర్వాత కమిటీ సభ్యులతో కలిసి ఆయన మధ్యాహ్నం 3.45 గంటలకు మోదీని కలుస్తారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సబ్ కమిటీ నివేదికను చంద్రబాబు మోదీకి ఇస్తారు. అనంతరం అమరావతి ఆహ్వాన పత్రికను కూడా ఆయన మోదీకి అందిస్తారు. తదనంతరం సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 5.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి వారికి చంద్రబాబు ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేయనున్నారు.