ఇకపై భారత్ లో యాపిల్ స్టోర్లు

13-10-2015 Tue 18:57

ఇకపై భారత్ లోకి యాపిల్ సంస్థకు చెందిన రీటైల్ స్టోర్లు రానున్నాయి. వచ్చే దీపావళి నుంచి యాపిల్ రీటైల్ స్టోర్లు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉన్న క్రోమాతో యాపిల్ తమ స్టోర్లు పెట్టుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ఇన్ఫినిటీ రీటైలర్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవిజిత్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్ఫినిటీ రీటైలర్స్ సంస్థను క్రోమా సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవిజిత్ మిశ్రా మాట్లాడుతూ ఈ స్టోర్లలో అన్నిరకాల యాపిల్ ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచుతామన్నారు. మొత్తం ఆరు క్రోమా స్టోర్లలో యాపిల్ స్టోర్లు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ముంబయిలో జుహు, ఒబరాయ్ మాల్, మలద్, ఘాట్ కోపర్, ఫీనిక్స్ మాల్ తో పాటు బెంగళూరు జయనగర్ లో ఉన్న క్రోమా స్టోర్ లోనే యాపిల్ స్టోర్లు పెడుతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా యాపిల్ స్టోర్ లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అదేమాదిరిగా ఉంటాయన్నారు. సేల్స్ బాయ్స్ కూడా యాపిల్ సంస్థలో శిక్షణ పొందిన వారే ఉంటారని అవిజిత్ మిశ్రా వివరించారు.