మంత్రి కాగానే హరీష్ రావు రైతులను మరచిపోయారు: రేవంత్ రెడ్డి

13-10-2015 Tue 17:34

మంత్రి పదవి చేపట్టిన వెంటనే హరీష్ రావు రైతులను మరచిపోయారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మామ, అల్లుళ్ల అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ రోజు ఆయన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆ గ్రామానికి చెందిన ప్రాణహిత-చేవెళ్ల నిర్వాసితులు రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాడుతుందని చెప్పారు.