: రిలయన్స్ పరమైన రూ. 8,900 కోట్ల విలువైన ఓఎన్జీసీ గ్యాస్!

కృష్ణా గోదావరి సహజవాయు బేసిన్ లో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) అధీనంలో ఉన్న చమురు క్షేతంలోని 9 బిలియన్ ఘనపు మీటర్ల సహజవాయువు పక్కనే ఉన్న రిలయన్స్ రిజర్వాయర్ లోకి వచ్చినట్టు అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ డీఅండ్ఎం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ గ్యాస్ కు సరాసరిన ఒక్క ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్)కు 4.2 డాలర్ల వంతున లెక్కగట్టినా, మొత్తం 1.4 బిలియన్ డాలర్ల (సుమారు 8,900 కోట్లు) విలువైన గ్యాస్ ఓఎన్జీసీ నుంచి రిలయన్స్ బావుల్లోకి వెళ్లినట్టని డీఅండ్ఎం పేర్కొంది. ఒఎన్జీసీ గోదావరి పీఎంఎల్ బ్యాక్ నుంచి రిలయన్స్ కేజీ-డీడబ్ల్యూఎన్-98/3 బ్లాక్ కు ఈ వాయువు వచ్చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కు అందించిన నివేదికలో సంస్థ తెలిపింది. ఈ విషయంలో చర్యలు తీసుకునే ముందు ఇరు కంపెనీల స్పందన కోరినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. కాగా, దీనిపై స్పందించేందుకు రిలయన్స్ ప్రతినిధి నిరాకరించారు. తామింకా సాంకేతిక నివేదికను పరిశీలించలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఒఎన్జీసీ ప్రతినిధి వివరించారు.

More Telugu News