ఓడిపోతున్నాం... బీహారులో విజయం బీజేపీదే: ములాయం సంచలన వ్యాఖ్య

13-10-2015 Tue 10:38

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ముగిసిన వేళ, సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని, మహాకూటమి ఓడిపోనుందని ఆయన వ్యాఖ్యానించారు. బీహారులో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ స్థాపించనుందని ఆయన అన్నారు. తామంతా కలసికట్టుగా ఉండలేకపోయామని, మహాకూటమి ఓటమికి ఇదే ప్రధాన కారణమని అన్నారు. నితీష్ కుమార్ తమను మోసం చేశాడని, జనతా పరివార్ ను ఏర్పాటు చేసినప్పుడు ఒకలా, ఆపై సీట్ల పంపిణీలో మరోలా వ్యవహరించారని ఆరోపిస్తూ, ఆయన తీరును ములాయం తీవ్రంగా ఆక్షేపించారు. బీహార్ నుంచి తమ పార్టీ పూర్తిగా నిష్క్రమించనుందని ఆయన అంచనా వేశారు. ఇప్పుడు ములాయం వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.