దినేశ్ మోంగియా పెద్ద ఫిక్సర్... లండన్ కోర్టు విచారణలో న్యూజిలాండ్ ఆటగాడు విన్సెంట్

13-10-2015 Tue 09:46

ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో భాగంగా క్రిస్ కెయిన్స్ కోసం తనతో పాటు దినేష్ మోంగియా మ్యాచ్ లను ఫిక్సింగ్ చేసినట్టు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు లూ విన్సెంట్ లండన్ కోర్టులో జరిగిన ఓ విచారణలో వెల్లడించాడు. తనను కెయిన్స్ ఈ ముగ్గులోకి దించాడని ఆరోపించిన విన్సెంట్, పోటీలు జరుగుతున్న సమయంలో ఓ ఇండియన్ ఫిక్సింగ్ ప్రతిపాదనతో తన వద్దకు వచ్చాడని తెలిపారు. డబ్బులతో పాటు అందమైన యువతులను కూడా పంపుతానని ఆఫర్ చేయగా, విషయాన్ని కెయిన్స్ కు చెప్పానని, కెయిన్స్ సైతం తనను ప్రోత్సహించాడని తెలిపాడు. కొంత మానసిక ఒత్తిడితో ఉన్న తాను వెంటనే ఆ గ్యాంగ్ లో చేరిపోయానని, మొత్తం నలుగురు సభ్యుల ఫిక్సింగ్ జట్టులో దినేష్ మోంగియా, న్యూజిలాండ్ పేస్ బౌలర్ డరైల్ టఫీ సభ్యులని విన్సెంట్ తెలిపాడు. కాగా, విన్సెంట్ ఆరోపణలను మోంగియా తీవ్రంగా ఖండించాడు. ఆయన చెప్పినది అబద్ధమని అన్నాడు. తాను ఆ సమయంలో చంఢీగఢ్ లయన్స్ కు ఆడానని, జట్టులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఏం చేశారో తనకు తెలియదని అంటున్నాడు.